దేశ రాజధాని ఢిల్లీని ఈ రోజు ఉదయం భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానకు నగరం అతలాకుతలమైంది. పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంచ్‌కుయియాన్ మార్గ్, మధుర రోడ్, భారత్ మండపం ప్రవేశ ద్వారం వద్ద రోడ్లతో పాటు శాస్త్రి భవన్, ఆర్.కె. పురం, మోతీ బాగ్ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఉదయాన్నే పనులకు, కార్యాలయాలకు వెళ్లేవారు ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుపోయారు. పలుచోట్ల రోడ్లపై నీరు నదులను తలపించడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు సగటున 15 నిమిషాలు, నగరానికి వచ్చే విమానాలు 5 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్‌రాడార్ వెల్లడించింది. అయితే, విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, ప్రయాణికులు తమ విమాన సర్వీసుల సమాచారం కోసం సంబంధిత సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇండిగో, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోందని, విమానాశ్రయానికి వచ్చేవారు అదనపు సమయం కేటాయించుకోవాలని ఇండిగో సూచించింది. వాతావరణ పరిస్థితుల వల్ల విమానాల రాకపోకలపై ప్రభావం పడవచ్చని, ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలని స్పైస్‌జెట్ కోరింది.
మరోవైపు, ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నగరంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.