మళ్లీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న నాగార్జున కల్ట్ క్లాసిక్ ’శివ‘

V. Sai Krishna Reddy
2 Min Read

అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘శివ’ మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలై ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త సాంకేతిక హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 4కే విజువల్స్, డాల్బీ అట్మోస్ సౌండ్‌తో ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

 

ఈ రీ-రిలీజ్‌పై హీరో నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. “నాకు ఒక స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ‘శివ’. నా పాత్రను ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిపింది. 36 ఏళ్లు గడిచినా ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే దాని ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే నా సోదరుడు వెంకట్ అక్కినేని, నేను కలిసి ఈ సినిమాను అంగరంగ వైభవంగా మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అప్పటి ప్రేక్షకులతో పాటు, కేవలం యూట్యూబ్‌లో మాత్రమే చూసిన కొత్త తరానికి కూడా ఈ చిత్రాన్ని ఒక గొప్ప అనుభూతితో అందించాలనుకుంటున్నాం” అని నాగార్జున ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే తాను, ఆర్జీవీ, వెంకట్ కలిసి ఈ సినిమాను 4కే విజువల్స్, డాల్బీ అట్మోస్ సౌండ్‌తో అందిస్తున్నామని వివరించారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “నాపై నాగార్జున, నిర్మాతలు ఉంచిన నమ్మకమే ఈ సినిమా అంతటి విజయం సాధించడానికి కారణం. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం, పాత్ర నేటికీ ప్రేక్షకులకు గుర్తుండటం ఆశ్చర్యంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించడం నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది” అన్నారు. ఒరిజినల్ సౌండ్ అప్పట్లో ప్రశంసలు అందుకున్నప్పటికీ, నేటి ప్రమాణాలకు తగ్గట్టుగా దాన్ని పూర్తిగా మార్చామని ఆయన తెలిపారు.

అధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఒరిజినల్ మోనో సౌండ్‌ను డాల్బీ అట్మోస్‌గా మార్చాం. ప్రేక్షకులు ఇదివరకే ‘శివ’ చూసి ఉండొచ్చు, కానీ ఈ కొత్త సౌండ్‌తో వారు పొందబోయే అనుభవం మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను” అని వర్మ వివరించారు.

ఈ సినిమా రీ-రిలీజ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆగస్టు 14న సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రంతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. నాగార్జున, అమల, రఘువరన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ సంభాషణల రచయిత (తనికెళ్ల భరణి) విభాగాల్లో మూడు నంది అవార్డులను గెలుచుకుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *