రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక ప్రమాదాలు, విషాద సంఘటనలు టీమ్ ను కలవరపెడుతున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రముఖ కన్నడ నటుడు టి.ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో మృతి చెందారు. ఉడుపిలోని హిరియడ్కలోని తన నివాసంలో ఆయన కుప్పకూలిపోయారు. ఆయనకు గతంలో గుండెకు సంబంధించిన చికిత్స కూడా జరిగింది.
కొన్ని రోజుల క్రితం ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో, చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన బాగానే ఉన్నప్పటికీ, హఠాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.
గత నవంబర్ లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న వ్యాన్ కి ప్రమాదం జరిగి చాలా మంది గాయపడ్డారు. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) నదిలో మునిగి ప్రాణాలు విడిచాడు. అనంతరం హాస్యనటుడు రాకేశ్ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇలా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి.