జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరుగుతున్న పోరులో మరో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖల్’లో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు.
వీరమరణం పొందిన వారిని లాన్స్ నాయక్ ప్రీత్‌పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్‌గా సైన్యం గుర్తించింది. వారి త్యాగానికి నివాళులు అర్పిస్తున్నట్టు భారత సైన్యానికి చెందిన చీనార్ కోర్ ఓ ప్రకటనలో తెలిపింది. “దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు లాన్స్ నాయక్ ప్రీత్‌పాల్ సింగ్, సిపాయి హర్మిందర్ సింగ్‌లకు చీనార్ కోర్ సెల్యూట్ చేస్తోంది. వారి ధైర్యం, అంకితభావం మాకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయి. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది`” అని సైన్యం ట్వీట్ చేసింది.
అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఈ నెల 1న భద్రతా బలగాలు దిగ్బంధించి గాలింపు చర్యలు చేపట్టాయి. అప్పటి నుంచి ఈ ఆపరేషన్ నిరంతరాయంగా సాగుతోంది. ఇప్పటివరకు ఐదుగురికి పైగా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం, ఇంకా కనీసం ముగ్గురు ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లోని సహజసిద్ధమైన గుహల్లో నక్కి ఉన్నట్టు తెలుస్తోంది.
దట్టమైన అటవీ ప్రాంతం, క్లిష్టమైన భూభాగం కావడంతో ఆపరేషన్ సవాలుగా మారింది. అత్యాధునిక రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు కలిగిన లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైన్యం డ్రోన్లు, హెలికాప్టర్లు, పారా కమాండోలను రంగంలోకి దించింది. ఎడతెరిపి లేకుండా కాల్పులు, పేలుళ్ల శబ్దాలతో సమీపంలోని అఖల్ గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రాణభయంతో ఇప్పటికే పలువురు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వారికి సహాయం అందించేందుకు అధికారులు నోడల్ ఆఫీసర్లను నియమించారు.