భాగ్యనగరాన్ని గురువారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో హైదరాబాద్ నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా, ఐటీ ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే కీలక సమయంలో వర్షం దంచికొట్టడంతో సైబర్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
గురువారం సాయంత్రం నగరంలోని మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌తో పాటు ఐకియా పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఆయా మార్గాల్లో వాహనాలు కదల్లేని స్థితిలో గంటల తరబడి నిలిచిపోయాయి. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్ వైపు వెళ్లే మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
సైబర్ సిటీలోనే కాకుండా, కూకట్‌పల్లి, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వంటి నగరంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు, ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షం, వరదలతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాహనాలను నెమ్మదిగా పంపిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.