భారతదేశపు అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఒకేసారి రెండు కీలక నిర్ణయాలు ప్రకటించి ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఉద్యోగులలో అత్యధికులకు జీతాలు పెంచుతున్నట్లు శుభవార్త చెబుతూనే, మరోవైపు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది.
బుధవారం ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత ఈ-మెయిల్‌లో, సంస్థ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్‌ఆర్ఓ) మిలింద్ లక్కడ్, సీహెచ్‌ఆర్ఓ డిజిగ్నేట్ కే. సుదీప్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. “సీ3ఏ గ్రేడ్ వరకు ఉన్న అర్హులైన ఉద్యోగులందరికీ సెప్టెంబర్ 1 నుంచి జీతాల పెంపును ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇది మన మొత్తం సిబ్బందిలో 80 శాతం మందికి వర్తిస్తుంది” అని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్ నిర్మాణంలో ఉద్యోగుల కృషికి, అంకితభావానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ పెంపు ఎంత శాతం ఉంటుందనే వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
అయితే, ఈ జీతాల పెంపు ప్రకటనతో పాటే కంపెనీలో కొనసాగుతున్న లేఆఫ్స్ ప్రక్రియ కూడా తెరపైకి వచ్చింది. ఈ ఏడాది సంస్థాగత మార్పులలో భాగంగా దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని టీసీఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఇది తమ మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 2 శాతమని, ప్రధానంగా మధ్య, సీనియర్ స్థాయి గ్రేడుల్లో ఈ కోతలు ఉంటాయని గతంలోనే కంపెనీ ప్రకటించింది.
ఈ ద్వంద్వ వైఖరిపై స్పందిస్తూ, “భవిష్యత్‌కు తగ్గ సంస్థగా మారే ప్రయాణంలో టీసీఎస్ ఉంది. ఇందులో భాగంగానే కొత్త టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించడం, మా వర్క్‌ఫోర్స్ మోడల్‌ను పునర్‌వ్యవస్థీకరించడం వంటివి చేస్తున్నాం” అని కంపెనీ వివరించింది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగుల తొలగింపు అనివార్యమని పేర్కొంది.
ఒకవైపు ప్రతిభను నిలుపుకోవడానికి జీతాలు పెంచుతూ, మరోవైపు సంస్థాగత మార్పుల కోసం ఉద్యోగులను తగ్గించుకోవడం ఐటీ పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులకు, మారుతున్న ప్రాధాన్యతలకు అద్దం పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.