గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన ముగ్గురు యువ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సృజనాత్మకతకు, సాంకేతికతకు నిదర్శనంగా నిలిచారు. భగవాన్ మహావీర్ యూనివర్సిటీ విద్యార్థులు శివమ్ మౌర్య, గురుప్రీత్ అరోరా, గణేశ్ పాటిల్ ‘గరుడ’పేరుతో ఒక అధునాతన, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) ఆధారిత బైక్‌ను తయారు చేశారు. ఈ బైక్‌ను 50 శాతం వ్యర్థ పదార్థాలతో, మిగిలిన 50 శాతం కస్టమ్-మేడ్ భాగాలతో కేవలం రూ.1.80 లక్షల ఖర్చుతో రూపొందించారు.
టెస్లా స్ఫూర్తితో..
ప్రపంచవ్యాప్తంగా టెస్లా వంటి కంపెనీలు ఆటోనమస్ డ్రైవింగ్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఈ విద్యార్థులు అదే స్ఫూర్తితో గరుడను నిర్మించారు. ప్రస్తుతానికి ఈ బైక్‌ను రైడర్ నడపాల్సి ఉన్నప్పటికీ, దీనిని పూర్తిస్థాయిలో డ్రైవర్‌లెస్ బైక్‌గా మార్చాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బైక్ ‘రాస్ప్బెర్రీ పై’ అనే చిన్న కంప్యూటర్‌తో పనిచేస్తుంది. ఇది బైక్‌కు మెదడులా పనిచేస్తూ, వైఫై, వాయిస్ కమాండ్ ఆధారిత వ్యవస్థ ద్వారా రైడర్ ఆదేశాలను అమలు చేస్తుంది.
అధునాతన సెన్సార్లతో అసాధారణ భద్రత
గరుడ బైక్‌లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో అమర్చిన రెండు హై-రేంజ్ సెన్సార్లు రియల్‌టైం పరిస్థితులను పసిగడతాయి. వాహనం 12 అడుగుల పరిధిలోకి రాగానే బైక్ నెమ్మదిస్తుంది. ఒకవేళ ఏదైనా అడ్డంకి మూడు అడుగుల దూరంలో ఉంటే, రైడర్ బ్రేకులు వేయకుండానే ‘స్టాప్ ఎట్ 3 ఫీట్ అవే’ అనే వాయిస్ కమాండ్ ద్వారా బైక్ పూర్తిగా ఆగిపోతుంది. ఈ ఏఐ ఆధారిత ఫీచర్ రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుంది.
టచ్‌స్క్రీన్.. స్మార్ట్ ఫీచర్లు
గరుడ బైక్‌లో టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్ ఉంది. దీని ద్వారా జీపీఎస్ నావిగేషన్, ఫోన్ కాల్స్, మ్యూజిక్ వంటి స్మార్ట్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ముందు, వెనుక భాగంలో అమర్చిన కెమెరాల ద్వారా రైడర్ తన చుట్టూ ఉన్న ట్రాఫిక్‌ను డిస్‌ప్లే స్క్రీన్‌పై చూడవచ్చు. సౌలభ్యం కోసం వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వ్యవస్థను కూడా ఇందులో పొందుపరిచారు.
ఇది ఇంకా ఒక ప్రొటోటైప్ మాత్రమే అయినప్పటికీ, దీని పనితీరు అద్భుతంగా ఉంది. గరుడ ఎకో మోడ్‌లో 220 కిలోమీటర్లు, స్పోర్ట్ మోడ్‌లో 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని లిథియం-అయాన్ బ్యాటరీ కేవలం రెండు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ బైక్‌ల కంటే చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.
ఏడాది శ్రమతో సాకారం
శివమ్ మౌర్య మాట్లాడుతూ.. ఈ బైక్‌ను తయారు చేయడానికి ఒక సంవత్సరం పట్టిందని చెప్పాడు. “మా బైక్ మూడు అడుగుల దూరంలో అడ్డంకిని గుర్తించి ఆగిపోతుంది, ఇది ప్రమాదాలను నివారిస్తుంది. ‘రాస్ప్బెర్రీ పై’ ఈ బైక్‌కు మెదడుగా పనిచేస్తుంది. ఇది ఆటోనమస్ వాహనంలా ఆదేశాలను అమలు చేస్తుంది” అని ఆయన వివరించారు.
ఆటోమొబైల్ నిపుణుడు వినోద్ దేశాయ్ ఈ విద్యార్థుల ఆవిష్కరణను ప్రశంసించారు. “డ్రైవర్‌లెస్ బైక్‌లు భవిష్యత్తుకు ఒక వాస్తవ రూపం. దీని బ్యాటరీ తేలికగా, ఏఐ ప్రతిస్పందనతో పనిచేస్తుంది. దీనికి అపారమైన అవకాశాలు ఉన్నాయి” అని ఆయన అన్నారు. గరుడ ప్రాజెక్ట్ భారతదేశ యువత సృజనాత్మకత, అంకితభావంతో సాధించగల విజయాలకు ఒక మంచి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.