రాహుల్ గాంధీ ఆశయం మేరకు తమ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లు తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును అసెంబ్లీలో పాస్ చేశామని చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణన జరిగిందని అన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న బీసీ ధర్నాలో ప్రసంగిస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ఆమె అపాయింట్‌మెంట్ కోరామని… అయితే, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరకలేదని చెప్పారు. తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వొద్దని రాష్ట్రపతిపై ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారనేది తమ అనుమానమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రిజర్వేషన్ బిల్లుకు మోదీ మద్దతు ఇవ్వకపోతే… మోదీని గద్దె దించి, రాహుల్ ను ప్రధాని చేసుకుని… బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని అన్నారు.