ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్‌లలో భారీ ఎత్తున డబ్బు కోల్పోయి, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం.
తాజాగా ఆన్లైన్ బెట్టింగ్‌ల కారణంగా ఓ పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బెట్టింగ్ గేమ్స్ ఆడకుండా ఉండలేక, చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలను తీసుకుంటున్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన నరేశ్ పోస్టల్ ఉద్యోగిగా పని చేస్తూ, తన భార్య కీర్తి, కుమార్తె భవ్యతో కలిసి వనస్థలిపురంలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై ఆర్ధికంగా నరేశ్ నష్టపోయాడు.
సుమారు రూ.15 లక్షల అప్పు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అనారోగ్యంతో ఇంట్లో ఉంటున్న నరేశ్.. అప్పులు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.