మంత్రి పదవిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే తనకు మంత్రి పదవి వచ్చేదని… కానీ, నియోజకవర్గ ప్రజల కోసం మునుగోడు నుంచి పోటీ చేశానని చెప్పారు. తనకు మంత్రి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని అన్నారు. మంత్రి పదవి కావాలా? మునుగోడు ప్రజలు కావాలా? అని అడిగితే… తనకు మునుగోడు ప్రజలే కావాలని చెబుతానని తెలిపారు.
తాను మంత్రినైతే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, తన జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చారని… ఎవరి కాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తన నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయనని చెప్పారు.