అర్బన్ బ్యాంక్ పరువు దెబ్బతీయొద్దు…
కక్షపూరిత ఆరోపణలు
ఎంక్వైరీ జరగకుండా సభ్యత్వాలు రద్దు చెల్లెదు
గతాన్ని మరిచి, అభివృద్ధికి కృషి చేయండి
బ్యాంక్ గౌరవాన్ని కాపాడదాం
విలాస్ రెడ్డి ఆరోపణలు నిరాధారమన్న మాజీ పాలకవర్గం
మాజీ చైర్మన్ రాజశేఖర్
కరీంనగర్ బ్యూరో, ఆగస్ట్ 05, (ప్రజాజ్యోతి)
కరీంనగర్ అర్బన్ బ్యాంక్ పీఏసీ కమిటీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బ్యాంక్ పరువును దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అవి పూర్తిగా నిరాధారమైనవని మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం తారక్ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2007 నుంచి 2017 వరకు చెయర్మన్‌గా, 15 మంది సభ్యులతో పాలకవర్గంగా పనిచేశామని గుర్తు చేసిన రాజశేఖర్ రెడ్డి, తమ పాలనపై ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. గత నెల 27న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ కోరమ్ లేకుండా వాయిదా పడిందని, ఈ నెల 3న మరోసారి 208 మంది సభ్యులతో సమావేశం పెట్టినా అదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. సహకార చట్ట ప్రకారం ఈ సమావేశాలకు చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు.తమపై ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధమైన విచారణ కూడా జరగలేదని, ఎనిమిదేళ్లుగా ఎంక్వైరీ లేదు అని పేర్కొన్నారు. బ్యాంకులో ఓవర్‌రైటింగ్ జరిగిందన్న ఆరోపణలకు తాము బాధ్యులు కాదని, మెంబర్షిప్ బుక్స్ సీఈఓ వద్ద ఉంటాయని తెలిపారు. అప్పుడు పనిచేసిన రాజారాం రెడ్డి అనే సీఈఓపై తాము చర్యలు తీసుకున్నామని, ఆయన కోర్టు ద్వారా తిరిగి ఉద్యోగంలోకి వచ్చారని వివరించారు.2017 లో ఇచ్చిన సభ్యత్వాల విషయంలో అప్పట్లో అకౌంట్ ఉన్నవారికే ఇవ్వాలనే నిబంధన లేదని, ఏ సభ్యుడికైనా ఇవ్వొచ్చని తేల్చిచెప్పారు. నోటీసు ఇవ్వకుండా తమ సభ్యత్వాలు రద్దు చేయడాన్ని ఖండించారు. 1982లో బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటినుండి 25 ఏళ్లలో 24 కోట్లు మాత్రమే డిపాజిట్ కాగా, తమ పాలనలోనే 60 కోట్ల డిపాజిట్లు వచ్చాయని వివరించారు. 2017 తర్వాత 8 ఏళ్లలో కేవలం 10 కోట్లు మాత్రమే పెరిగాయని తేల్చిచెప్పారు.
విలాస్ రెడ్డికి మా మెంబర్షిప్ రద్దు చేసే హక్కు లేదు. కోర్టు ఆర్డర్ వస్తే అక్కడ తేల్చుకుంటాం. గతంలో ఓడి మళ్లీ రాజకీయ కక్షతో ఆరోపణలు చేయొద్దు. బ్యాంక్ అభివృద్ధికి సహకరించండి అని హితవు పలికారు. వ్యక్తిగత రాజకీయాలకంటే బ్యాంక్ భవిష్యత్తే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ పాలక వర్గం సభ్యులు బా శెట్టి కిషన్ ,వరాల జ్యోతి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.