బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామాపై ఈరోజు ఆయన స్పందిస్తూ… కేసీఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ కుటుంబం కొంత బాధలో ఉందని ఆయన అన్నారు. ఆ కుటుంబాన్ని తాను మరింత బాధ పెట్టదలుచుకోలేదని చెప్పారు.
తెలంగాణ రాజకీయ పరిస్థితులు మారిపోయాయని… మారిన పరిస్థితుల్లో తాను జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నానని బాలరాజు తెలిపారు. ప్రజల్లో బలంలేని నాయకులను బీఆర్ఎస్ నాయకత్వం నమ్ముకుందని చెప్పారు. జనరల్ నియోజకవర్గాల్లో దళితులకు సీట్లు ఇచ్చే దమ్ము బీఆర్ఎస్ కు ఉందా? అని ప్రశ్నించారు. గత ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్ లో తన ప్రాధాన్యతను తగ్గించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, బాలరాజు ఒక బీఆర్ఎస్ కార్యకర్తతో మాట్లాడిన ఓ ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది లేదా పొత్తు పెట్టుకుంటుంది అనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే మన అభ్యర్థిత్వం ఎగిరిపోతుంది. గతంలో బీజేపీతో నేను పోరాటం చేశాను. అందుకే బీఆర్ఎస్ కంటే ముందే నా దారి నేను చూసుకుని బీజేపీలో కలవడం మంచిది. నన్ను కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చారు. అది నన్ను ఎంతో బాధించింది” అని బాలరాజు అన్నట్టుగా ఆ ఫోన్ కాల్ లో ఉంది. ఏదేమైనప్పటికీ బాలరాజు రాజీనామా వ్యవహారం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది