అమెరికాలో శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ముఖ్యంగా వివాహం ద్వారా గ్రీన్ కార్డ్ పొందాలనుకుంటున్న వారికి ఇది షాకింగ్ వార్తే. అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS), వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ దరఖాస్తుల కోసం కొత్త, కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. మోసపూరిత వివాహాలను అరికట్టి, గ్రీన్ కార్డ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ఈ నెల 1న విడుదల చేసిన మార్గదర్శకాలలో యూఎస్ సీఐఎస్ స్పష్టం చేసింది.
వివాహ ఆధారిత గ్రీన్ కార్డుపై అమెరికా కొత్త రూల్స్ ఇవే!
కొత్త నిబంధనల ప్రకారం, గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి జంట తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తమ బంధం నిజమైనదేనని నిరూపించుకోవడానికి బలమైన సాక్ష్యాధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో జంటగా దిగిన ఫొటోలు, ఉమ్మడి బ్యాంకు ఖాతాలు, ఆస్తి పత్రాలు, అలాగే వారి వివాహం వాస్తవమైనదని ధ్రువీకరిస్తూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇచ్చే అఫిడవిట్లు కూడా ఉండాలి.
ఇప్పటికే అమెరికాలో హెచ్-1బీ వంటి తాత్కాలిక వీసాలపై ఉంటూ, వివాహం ద్వారా తమ స్టేటస్‌ను మార్చుకోవాలనుకునే వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. దరఖాస్తుదారుల పాత ఇమ్మిగ్రేషన్ చరిత్రను, గతంలో ఎవరైనా ఒకే వ్యక్తి వేర్వేరు వ్యక్తులను స్పాన్సర్ చేశారా? అనే కోణంలోనూ లోతుగా పరిశీలిస్తారు.
ఈ నిబంధనలలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఒకవేళ గ్రీన్ కార్డ్ దరఖాస్తు ఆమోదం పొందినా, ఇతర చట్టపరమైన కారణాల వల్ల దరఖాస్తుదారుడు దేశంలో ఉండటానికి అనర్హుడని తేలితే, అతడిని దేశం విడిచి వెళ్లమని ఆదేశిస్తూ నోటీస్ టు అప్పియర్ (NTA) జారీ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇది ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని యూఎస్ సీఐఎస్ తెలిపింది.
ఈ మార్పుల నేపథ్యంలో దరఖాస్తుదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు సూచిస్తున్నారు. పాత ఫారాలు వాడటం, అసంపూర్తిగా వివరాలు ఇవ్వడం వంటి పొరపాట్లు చేస్తే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సంక్లిష్టంగా మారిన ఈ ప్రక్రియలో నిపుణులైన లాయర్ల సహాయం తీసుకోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కఠిన నిబంధనల వల్ల గ్రీన్ కార్డ్ ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చని, కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని తెలుస్తోంది. అయితే, వలస విధానంపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకే ఈ చర్యలు అవసరమని యూఎస్‌సీఐఎస్ వాదిస్తోంది.