కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలంలో జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తవ్వకాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా వందలాది మందిని హత్య చేసి పూడ్చిపెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో, అధికారులు తవ్విన కొద్దీ పుర్రెలు, మానవ ఎముకలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో పవిత్ర క్షేత్రం చుట్టూ అలుముకున్న మిస్టరీ మరింత బలపడుతోంది.
1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థలంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి, తాను వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని జులై 3న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడులకు గురైన మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు వాటిలో ఉన్నాయని, తన ప్రాణాలకు హాని ఉందని రక్షణ కోరడంతో కర్ణాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది.
సిట్ అధికారులు ఆ కార్మికుడు చూపిన ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టగా, ఆరోపణలకు బలం చేకూరుస్తూ మానవ అవశేషాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు గుర్తించిన 13 ప్రదేశాలలో ఆరింటిలో తవ్వకాలు జరపగా, ఇటీవల ఆరవ ప్రదేశంలో మరిన్ని ఎముకలు లభ్యమయ్యాయి. ఒకచోట చిరిగిన ఎరుపు రంగు జాకెట్‌తో పాటు లక్ష్మి అనే మహిళకు చెందిన పాన్ కార్డు కూడా దొరకడం దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.
ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, నేడు జయన్ టి. అనే మరో సాక్షి ముందుకొచ్చాడు. 15 ఏళ్ల క్రితం 15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టడం తాను చూశానని ఆయన చెప్పడంతో సిట్ అధికారులు ఆ దిశగా కూడా దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, ఈ కేసులో మీడియా కవరేజీని నిలుపుదల చేస్తూ గతంలో జారీ అయిన గ్యాగ్ ఆర్డర్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.
1995-2014 మధ్యకాలంలో ధర్మస్థల పరిసరాల్లో దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. 2013 నాటి సౌజన్య అనే విద్యార్థిని హత్య కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజా ఆరోపణల నేపథ్యంలో పాత కేసుల దస్త్రాలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. “ధర్మస్థల దేవాలయం శ్మశాన వాటికగా మారిపోయింది” అని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా ఆరోపించారు. ఆలయ ట్రస్ట్ సభ్యులను వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండటంతో, ఈ హత్యల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది త్వరలోనే తేలుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.