ఏడాదిలో దాదాపు 23 వేల కోట్లు కొట్టేశారు.. సైబర్ నేరస్థుల చేతివాటం

V. Sai Krishna Reddy
2 Min Read

దేశంలో ఏటేటా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ స్కాంల బారిన పడి చాలామంది తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారని చెబుతున్నారు. ఒక్క 2024 లోనే సైబర్ నేరగాళ్లు భారతీయుల నుంచి రూ.22,842 కోట్లు కొట్టేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. ఆన్ లైన్ మోసాలకు ఈ ఏడాది భారతీయులు దాదాపు రూ.1.2 లక్షల కోట్లు కోల్పోనున్నారని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ అంచనా వేసింది.

డాటా లీడ్స్ సంస్థ నివేదిక ప్రకారం.. 2023లో ఆన్ లైన్ మోసాల బారిన పడి భారతీయులు రూ.7,465 కోట్లు కోల్పోయారు. 2‌022లో ఇలా కోల్పోయిన మొత్తం రూ.2,306 కోట్లు. సైబర్ మోసానికి గురయ్యామంటూ 2024లో పోలీసులను ఆశ్రయించిన వారి సంఖ్య దాదాపుగా 20 లక్షలు కాగా ఫిర్యాదు చేయని వారిని కూడా కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏటేటా పెరిగిపోతున్న ఆన్ లైన్ మోసాలను చూస్తుంటే సైబర్ నేరస్థులు తెలివిమీరుతున్నారని తెలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒక మోసం విస్తృతంగా వ్యాపించి జనాలకు దానిపై అవగాహన పెరిగిందని గుర్తించిన వెంటనే కొత్తరకం మోసాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ కొత్త కొత్త పద్ధతులలో మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. యూపీఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత మూడేళ్లలోనే సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. మెసేజ్ ల రూపంలో, వాట్సాప్ సందేశాల రూపంలో లింక్ లు పంపి బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా ఊడ్చేయడం ఒక పద్ధతి కాగా, ఈ కామర్స్ వేదికల ఫేక్ సైట్లను సృష్టించి డబ్బులు కొట్టేయడం మరో పద్ధతి.

ఆన్ లైన్ వేదికలపై ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించి బోల్తా కొట్టించడంలో సైబర్ నేరస్థులు ఆరితేరారని నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన వస్తువులను తక్కువ ధరకే అమ్ముతామంటూ ప్రలోభపెట్టి అందినకాడికి దోచేసి ఫోన్ స్విచ్ఛాప్ చేస్తుండడం సాధారణంగా మారిందని వివరించారు. గతేడాది తొలి మూడు నెలల కాలంలో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా సైబర్ నేరస్థులు వేలాదిమందిని ముంచేశారని ఓ నివేదిక వెల్లడించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *