ప్రముఖ సినీ నటి రాధికా శరత్ కుమార్ ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న రాధికను కుటుంబ సభ్యులు గత నెల 28న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాధికకు డెంగ్యూ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని, ఆమెకు చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం రాధిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నాయి. అయితే, ఈ నెల 5 వరకు రాధికకు చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాతే ఆమెను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. అభిమానులు, సహచరులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు, సీరియల్స్ లలో నటించి రాధిక మంచి గుర్తింపు పొందారు. నటిగానే కాకుండా విజయవంతమైన టీవీ సీరియల్ నిర్మాతగానూ పేరొందారు. రాధిక రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో చిరంజీవితో ఆమె దాదాపు 15కు పైగా సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు.