తాను ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలో అన్ని విషయాలను బయటపెడతానని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత అన్నారు. ఆమెను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి విచారణ నిమిత్తం తరలించారు. గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు. కోర్టు ఆమెను 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.
గాంధీ ఆసుపత్రి వద్ద ఆమె మాట్లాడుతూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఒక ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె అన్నారు.
సృష్టి సరోగసి అక్రమాల కేసులో డాక్టర్ నమ్రత ఏ1గా ఉన్నారు. సరోగసి పేరుతో ఆమె పలువురు దంపతులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల సాయంతో అసోంకు చెందిన మహిళల నుంచి పిల్లలను కొనుగోలు చేసి తీసుకువచ్చి, ఆయా దంపతులకు వారి బిడ్డలుగా అప్పగించే వారని ఆరోపణలు వున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వీర్యం, అండాలు సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయించారు.