రేపు యాదాద్రి పవర్ ప్లాంట్ కు రానున్న డిప్యూటీ సి ఎం భట్టి
ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ కు శంకుస్థాపన, యూనిట్ -1 ప్రారంభం
మిర్యాలగూడ, జులై 31,(ప్రజాజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం మిర్యాలగూడ డివిజన్లోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు రేపు ( ఆగస్టు1న) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. మంత్రులు ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లతో కలిసి పాల్గొననున్నట్లు వెల్లడించారు. ప్లాంట్లో సకల సౌకర్యాలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ కు శంకుస్థాపన చేయటంతో పాటు, 1వ యూనిట్ ను జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరిన మంత్రులు 10 గంటలకు యాదాద్రి పవర్ ప్లాంట్ కు చేరుకుంటారు. 10:15 గంటల నుండి 11:00 వరకు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించి,11:00 గంటల నుండి 11:45 వరకు యూనిట్ -1ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు.12:00 గంటల నుండి మధ్యాహ్నం1:00 గంట వరకు అధికారులతో సమీక్షా సమావేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారని, 1:45 గంటలకు తిరిగి బేగంపేట వెళ్లిపోనున్నట్లు తెలిపారు.