విజయ్ దేవరకొండకి హిట్ లేక చాలా కాలమవుతోంది. ప్రయోగాలు చేస్తున్నాడుగానీ, ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన సినిమానే ‘కింగ్ డమ్’. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ఈ రోజున థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.
కథ: సూరి (విజయ్ దేవరకొండ) శివ (సత్యదేవ్) ఇద్దరూ అన్నదమ్ములు. సూరి పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉంటాడు. మేనమామ యాదగిరి సంరక్షణలోనే అతను పెద్దవాడవుతాడు. సూరి తల్లి తన పెద్ద కొడుకైన శివ గురించి బాధపడుతూ ఉంటుంది. శివ చిన్నప్పుడే తన తండ్రిని హత్య చేసి ఆ ఊరొదిలి పారిపోతాడు. అతను ఎక్కడికి వెళ్లాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి సూరి ప్రయత్నిస్తూ ఉంటాడు. అన్నను ఇంటికి తీసుకురావడమే అతని ముందున్న ఏకైక లక్ష్యం.
సూరికి ఆవేశం ఎక్కువ .. భయం తక్కువ. తాను అనుకున్న పనిని పూర్తిచేయడం అతనికి మొదటి నుంచి ఉన్న అలవాటు. అదే అతనికి ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేసే అవకాశాన్ని తెచ్చిపెడుతుంది. అండర్ కవర్ ఆపరేషన్ చేయడం వలన, తన అన్నయ్యను కలుసుకోవచ్చనే ఉద్దేశంతో అతను అందుకు అంగీకరిస్తాడు. ఆ పనిపై అతను శ్రీలంక ప్రయాణమవుతాడు. తన అన్నయ్య జాఫ్నాలోని జైల్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి ఒక ఖైదీగా వెళతాడు.
జాఫ్నా లోని జైల్లో సూరి తన అన్నయ్యను మొదటిసారిగా చూస్తాడు. శివ ఎలాంటి వాతావరణంలో పెరిగాడో .. ప్రస్తుతం అతను ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడనేది అతనికి అర్థమైపోతుంది. అయితే తన తమ్ముడే సూరి అనే విషయం శివకి తెలియదు. అక్కడ వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుంది? సూరికి అప్పగించబడిన అండర్ కవర్ ఆపరేషన్ ఏంటి? శివను తీసుకుని అక్కడి నుంచి బయటపడాలనే సూరి కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఇది అన్నదమ్ముల ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ. చిన్నతనంలో ఇంట్లో నుంచి పారిపోయిన అన్నయ్యను వెతికి తీసుకుని రావడానికి ఆరాటపడే ఒక తమ్ముడి కథ ఇది. శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతానికీ, శ్రీలంకలోని తీర ప్రాంతానికి మధ్య ఈ కథ నడుస్తుంది. శ్రీలంక తీర ప్రాంతానికి చెందిన గూడెం ప్రజలకు .. సూరికి మధ్య ఉన్న సంబంధం ఏమిటనే సన్నివేశంతోనే దర్శకుడు ఈ కథను ఆరంభించడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
హీరో శ్రీలంక వెళ్లడానికి రంగం సిద్ధమయ్యే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అయితే హీరో అక్కడికి వెళ్లిన తరువాత సన్నివేశాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అన్నయ్యతో ఎమోషనల్ సీన్స్ ను, అందమైన హీరోయిన్ తో లవ్వు .. రొమాన్స్ ను ఇక్కడే ఆడియన్స్ ఆశిస్తారు. అయితే ఆ విషయాలపై దర్శకుడు దృష్టిపెట్టినట్టుగా కనిపించడు.
విలన్ కొత్తగా .. విలనిజం కాస్త పవర్ఫుల్ గానే కనిపిస్తుంది. సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలను ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఊహించుకుంటారు. అయితే ఆ అంచనాలకు దూరంగా ఆ సన్నివేశాలు సాగుతాయి. ప్రీ క్లైమాక్స్ లో మొదలైన హింస, క్లైమాక్స్ లో ఆగుతుంది. హీరో మొదటి నుంచి సాధారణంగా కనిపిస్తూ, చివర్లో తెగించడం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరలేదేమో అనిపిస్తుంది.
పనితీరు: సితార బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కావడం వలన, నిర్మాణ పరమైన విలువలను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గౌతమ్ తిన్ననూరి రాసుకున్న కథ – కథనం కాస్త భిన్నంగా అనిపించినప్పటికీ, పూర్తిస్థాయిలో కనెక్ట్ చేయలేకపోయాడు. బలమైన సన్నివేశాలు డిజైన్ చేసుకోకుండా హీరో పాత్రను ఒక రేంజ్ లో చూపించడానికి ప్రయత్నించాడు. యోధుడు .. సూర్యుడు .. దేవుడు అంటూ హడావిడి చేశాడు.
విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో కనిపిస్తాడు. తెలంగాణ యాస మినహా, ఆయన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ కి దూరంగా ఈ పాత్ర నడుస్తుంది. భాగ్యశ్రీ బోర్సే అందంగా మెరిసింది అంతే. చెప్పుకోదగిన పాత్ర కూడా కాదు అది. సత్యదేవ్ .. యంగ్ విలన్ వెంకిటేశ్ నటన కూడా పాత్ర పరిధిలోనే కనిపిస్తుంది. గిరీశ్ గంగాధరం .. జోమన్ టి జాన్ ఫొటోగ్రఫీ, అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయని చెప్పచ్చు. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే.
ముగింపు: విజయ్ దేవరకొండ తన బాడీ లాంగ్వేజ్ కి డిఫరెంట్ గా కనిపించే కథ ఇది. కథను ..ప్రధానమైన పాత్రలను సరిగ్గా డిజైన్ చేసుకోకుండా సన్నివేశాలను లేపడానికి ట్రై చేయడం మైనస్ గా అనిపిస్తుంది. ఆడియన్స్ అంచనాలు పెట్టుకున్న సన్నివేశాలు ఫ్లాట్ గా సాగిపోవడం, లవ్ .. రొమాన్స్ ను అసలు టచ్ చేయకపోవడం వాళ్లకి నిరాశను కలిగించే అంశాలుగానే చెప్పాలి. ఈ విషయాల్లో కేర్ తీసుకుని ఉంటే సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లి ఉండేదేమో.