తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యంపై నేడు స్పష్టత రానుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యాజ్యానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది.
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.
ఈ ఏడాది జనవరి 15న పిటిషన్లు దాఖలు కాగా, సుప్రీంకోర్టులో తొమ్మిది సార్లు విచారణకు వచ్చాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం అన్ని వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ కేసులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి ప్రకాశ్ గౌడ్, ఎ గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ ఉన్నారు.