ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాలలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న సాహిల్ చౌదరి (19) అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సాహిల్‌ది రాజస్థాన్.
ఈ రోజు ఉదయం సాహిల్ గదిలో ఒక్కడే ఉన్నట్లు సమాచారం. రూములో ఉండే మిగతా విద్యార్థులు వచ్చి సాహిల్‌ను పిలిచినా పలకకపోవడంతో తలుపు తీసే ప్రయత్నం చేశారు. కానీ, ఎంతకీ తలుపులు తెరుచుకోకపోవడంతో పగలగొట్టి చూసేసరికి సాహిల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
వెంటనే తోటి విద్యార్థులు అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే సాహిల్ చౌదరి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు విద్యార్థి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. రిమ్స్ అధ్యాపకులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఆత్మహత్యగల కారణాలు తెలుసుకుంటామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ఈ ఘటనతో మెడికల్ కళాశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.