విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, అలాగే ప్లాంట్‌ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. అయితే, విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆదిత్య యాదవ్ నిన్న లోక్‌సభలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సమాధానమిచ్చారు.
విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను యథాతథంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం చేసిందని తెలిపారు.