ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ ధనార్జనే యాజమాన్యాల ధ్యేయం వర్షాలతో పెరుగుతున్న వైరల్ వ్యాధులు దడ పుట్టిస్తున్న ఓపీ చార్జీలు జ్వరంతో వెళితే…పలురకాల రక్తపరీక్షలు అవసరం లేకపోయినా అడ్మిట్లతో నిలువు దోపిడీ ఆస్పత్రుల్లో,ల్యాబ్‌లలో కానరాని ఫీజుల పట్టిక

Karimnagar Bureau
4 Min Read

ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ

ధనార్జనే యాజమాన్యాల ధ్యేయం

వర్షాలతో పెరుగుతున్న వైరల్ వ్యాధులు

దడ పుట్టిస్తున్న ఓపీ చార్జీలు

జ్వరంతో వెళితే…పలురకాల రక్తపరీక్షలు

అవసరం లేకపోయినా అడ్మిట్లతో నిలువు దోపిడీ

ఆస్పత్రుల్లో,ల్యాబ్‌లలో కానరాని ఫీజుల పట్టిక

 

 

కరీంనగర్‌ క్రైం,జులై 29 ,ప్రజాజ్యోతి:

ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతలో ఉండి కొందరు వైద్యులే పేదల రక్తం పీల్చేస్తున్నారు. అసలే అనారోగ్య కష్టాలతో వచ్చే రోగుల దగ్గర విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ జేబులు గుళ్ల చేస్తున్నారు.ఆర్‌ఎంపీలతో వాటాలు మాట్లాడుకుని మరీ పేషంట్లను లూటీ చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్‌ హాస్పిటళ్లు.ఇలా టెస్టుల దగ్గర నుంచి ఆపరేషన్ల దాకా డబ్బులు పిండేయటమే లక్ష‌్యంగా కొన్ని ప్రయివేటు ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయి,వర్షాల వల్ల పెరుగుతున్న వైరల్ వ్యాధులతో ఆసుపత్రికి వెళితే పలురకాల రక్తపరీక్షలు నిర్వహించి అవసరం లేకపోయినా అడ్మిట్లతో నిలువు దోపిడీ చేస్తున్నారు,కరీంనగర్ జిల్లాలో సుమారు 400 పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి.ఈ హాస్పిటల్స్ లో చార్జీల వసూళ్లపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల కంట్రోల్ లేకపోవడంతోనే మేనేజ్మెంట్ లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రశ్నించిన పేషెంట్ల బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దౌర్జన్యానికి దిగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వాలు మంచి వసతి సౌకర్యాలాను ప్రభుత్వ సుపత్రుల్లో ఏర్పాట్లు చేస్తున్నా జనం మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

దడ పుట్టిస్తున్న ఓపీ చార్జీలు..

కరీంనగర్ లో ప్రైవేట్,కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఓపీ ధరలు దడ పుట్టిస్తున్నాయి.ఏదైనా నొప్పి, జ్వరం అంటూ సాధారణ చెకప్ కు వెళ్లినా ఆస్పత్రులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఇక ఎమర్జెన్సీ టైమ్లో వెళ్తే మరింత ఎక్కువగా ఫీజులు గుంజుతున్నాయి.ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో స్పెషలిస్ట్ ఓపీ కావాలంటే కనీసం రూ.500 కట్టాల్సిందే. అదే కార్పొరేట్ హాస్పిటల్, పేరున్న డాక్టర్ అయితే రూ.1,000 నుంచి రూ.1,500 దాకా ఉంటుంది.అది కూడా కేవలం పేషెంట్ను నిమిషాల్లోపు చూసేసి బ్లడ్ టెస్టులు, ఇతర ట్యాబ్లెట్స్ రాసి పంపించేస్తున్నారు.ఒకవేళ అదే స్పెషలిస్టు డాక్టర్ దగ్గరికు ఎమర్జెన్సీ టైమ్ లో వెళ్తే ఓపీ పేరుతోనే రూ.2 వేల దాకా వసూలు చేస్తున్నారు.గతంలో రూ.300 వరకు ఉండే ఓపీ ధర ఇప్పుడు రూ.500 నుంచి రూ.1,000 దాకా పెరిగింది.కరోనా తర్వాత నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఓపీ ధరలను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు.

మల్టీ స్పెషాలిటీ పేరుతో…

కరీంనగర్ లో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల పేరుతో గ్రామీణుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు.కొన్ని ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తున్న కొంతమంది వైద్యులతో ల్యాబ్‌ల నిర్వాహకులు కుమ్మక్కవుతున్నారు.అవసరం లేకపోయినా పలురకాల వైద్య పరీక్షలు చేయించి, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు,ల్యాబ్‌ ఫీజుల్లో 20 నుంచి 40 శాతం వరకు ల్యాబ్‌ నిర్వాహకులు సంబంధిత వైద్యులకు కమిషన్‌ రూపంలో పంపుతుంటారు.ప్రైవేటు ఆస్పత్రులు, లేబొరేటరీల నిర్వాహకులు అడ్డగోలుగా రోగులను దోచుకుంటుంటే వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి

ఆస్పత్రుల్లో,ల్యాబ్‌లలో కానరాని ఫీజుల పట్టిక

క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం ప్రైవేటు ఆస్పత్రులు,ల్యాబ్‌లలో ఏ పరీక్షకు ఎంత ఫీజు తీసుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాల పట్టికను అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి.కానీ జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినికల్‌ ల్యాబ్‌లలో ఎక్కడా ఫీజు వివరాల పట్టికలు కనిపించవు.పైగా ఒక్కో రకం వైద్యానికి ఒక్కో ప్యాకేజీని నిర్ణయించి రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు.

నిబంధనలు పాటించని ల్యాబ్‌లు..

ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ల్యాబ్‌లు, మెడికల్‌ షాప్‌లు నిర్వహిస్తున్నారు.అయితే సంబంధిత ల్యాబ్‌ల్లో అర్హత గల ల్యాబ్‌ టెక్నిషియన్‌, పాథలజిస్టును, మెడికల్‌ దుకాణాల్లో అర్హత గల ఫార్మసిస్టులు ఉండడం లేదు.అనర్హత గల వ్యక్తులే ల్యాబ్‌ పరీక్షలు చేస్తుండడం,మెడికల్‌ దుకణాల్లో మందులు ఇస్తుండడం వంటివి జరుగుతున్నాయి.ల్యాబ్‌లు, మెడికల్‌ దుకాణాల్లో విచ్చలవిడిగా ఫీజులు, డబ్బులు గుంజుతున్నారు.తమకు అధిక ఆదాయాన్ని అందించే కొన్ని కంపెనీలకు చెందిన మందులను మాత్రమే ఆసుపత్రి అటాచ్‌ మెడికల్‌లో విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. వైద్యులు సైతం సంబంధిత కంపెనీలకు చెందిన మందులను మాత్రమే చీటిలపై రాస్తున్నారు. ల్యాబ్‌ పరీక్షల్లో సైతం ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా డెంగీ జ్వరం ఎలిసాటెస్ట్‌ ద్వారానే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాంటి పరీక్షలు లేవు. అయినప్పటికీ కొందరు ప్రైవేటు ల్యాబ్‌ నిర్వాహకులు ఇతర పరీక్షలు చేసి డెంగీ పాజిటివ్‌ అంటూ నిర్ధారిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

పల్లెల్లో ఆర్‌ఎంపీలదే హవా..

జిల్లాలోని పలు పల్లెల్లో ఆర్‌ఎంపీలదే హవా కొనసాగుతోంది.పల్లె ప్రాంతాల్లో జ్వర పీడితులు ఎక్కువగా ఉంటుండడంతో ముందుగా స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.ఆర్‌ఎంపీ, పీఎంపీలు రెండు,మూడు రోజుల పాటు చికిత్స అందిస్తుండగా జ్వరాలు తగ్గని పరిస్థితుల్లో నగరాల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నారు.రోగుల అవసరాలను ఆసరా చేసుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు రూ. వేలల్లో ఫీజులు గుంజుతున్నాయి. ఇందులో కొంత మొత్తాన్ని రెఫర్‌ చేసిన ఆర్‌ఎంపీ,పీఎంపీలకు ప్రైవేటు ఆసుపత్రులు కమిషన్ల రూపంలో చెల్లిస్తున్నాయి.దీంతో రోగుల జేబులు గుల్లా అవుతున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *