తెలంగాణలోని జుబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్పందించారు. జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గత నెలలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ గెలుస్తామనే ధీమాతో ఉన్నాయి. ఆయా పార్టీల్లో అప్పుడే టిక్కెట్ కోసం ఆశావహులు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ప్రయోగం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది.
ఈ చర్చ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతూ, జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసే ప్రతిపాదన ఏమీ రాలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, తెలంగాణ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం తాము పనిచేస్తుంటామని ఆయన అన్నారు. అయితే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం స్వతంత్రంగా పనిచేయడం బీజేపీ ప్రత్యేకత అని తెలిపారు. అధిష్ఠానానిదే తుది నిర్ణయమని ఆయన తెలిపారు.