ఈ ఏడాది కృష్ణానదీ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలలో కురిసిన భారీ వర్షాలకు ముందస్తుగానే జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు జలాశయాలు గత వారంలోనే గరిష్ఠ స్థాయి మట్టాలకు చేరాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి అదనంగా వచ్చే వరదనంతా నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి 1,98,920 క్యూసెక్కుల మేర వరద పెరగడంతో నిన్న నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి 1,08,260 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,896 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్‌కు 2,01,743 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం సాగర్ ఔట్ ఫ్లో 41,882 క్యూసెక్కులుగా నమోదైంది. ఈరోజు ఉదయం గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రజలు నదిలోకి వెళ్లవద్దని సూచించారు.
సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.60 అడుగుల నీటి మట్టం ఉంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.4 టీఎంసీలకు చేరుకోవడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు భారీ వరద కొనసాగుతోంది