ప్రముఖ భారత ఫార్మా కంపెనీలైన సన్ ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ తమ ఔషధాలను అమెరికా మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. నాణ్యత సమస్యలు, ఉత్పాదన లోపాలు, ఆయా ఔషధాల్లోని వివిధ కాంబినేషన్ల కారణంగా (రీకాల్) వెనక్కి పిలిపిస్తున్నాయి. యూఎస్ ఆరోగ్య నియంత్రణ సంస్థ (USFDA) తాజా నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడైంది.
రీకాల్ వివరాలు:
సన్ ఫార్మా: ప్రిన్స్టన్కు చెందిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఇంక్, Lisdexamfetamine Dimesylate క్యాప్సూల్స్ (60 mg) లోని లోపాల కారణంగా 5,448 బాటిళ్లను రీకాల్ చేస్తోంది. ఈ ఔషధం దృష్టి లోపం (ADHD) చికిత్సకు ఉపయోగించబడుతుంది. ఈ రీకాల్ జూన్ 16న ప్రారంభించారు.
లుపిన్: ముంబైకి చెందిన లుపిన్ ఔషధ తయారీ సంస్థ, అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే Lisinopril మరియు Hydrochlorothiazide టాబ్లెట్స్ (USP 20mg/12.5mg) యొక్క 58,968 బాటిళ్లను రీకాల్ చేస్తోంది. నాగ్పూర్ లోని వారి తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేయబడిన ఈ బ్యాచ్ ఔషధాల రీకాల్ ప్రక్రియ జూన్ 20న ప్రారంభమైంది.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్: డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఇంక్ ఒమెప్రజోల్ డీలేడ్-రిలీజ్ క్యాప్సూల్స్ యొక్క 1,476 బాటిళ్లను రీకాల్ చేస్తోంది. ఈ ఔషధం కడుపు మరియు అన్నవాహిక సమస్యల చికిత్సకు ఉపయోగించబడుతుంది.
ఈ రీకాల్లను USFDA ‘క్లాస్ II’ రీకాల్లుగా వర్గీకరించింది. ఈ ఔషధాలు వాడితే తాత్కాలిక లేదా వైద్యపరంగా ప్రతికూల ఆరోగ్య పరిణామాలు సంభవించే అవకాశాలు ఉంటాయన్నది USFDA వాదన.