బీజేపీలో కుల రాజకీయాలకు తావులేదని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా ఆసక్తికరంగా స్పందించారు.
బీజేపీలో కుల రాజకీయాలకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారని గుర్తు చేశారు. ఆయన తర్వాత కూడా అక్కడ బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిగా నియమించారని తెలిపారు.
బీజేపీ పాలిత అనేక రాష్ట్రాల్లో బీసీ నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నారని ఆయన వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన అన్నారు. ఆరు నెలల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని జోస్యం చెప్పారు. మీరు ముఖ్యమంత్రి అవుతారా అని విలేకరులు అడగగా, తనను అభిమానించే వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.