పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరి హర వీర మల్లు’ సినిమా టిక్కెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. టిక్కెట్ బుకింగ్స్ ఇప్పటికే ‘డిస్ట్రిక్ట్ యాప్ లో ప్రారంభం కాగా, బుక్ మై షో ద్వారా ఈ సాయంత్రం ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఇక, ప్రీమియం సీట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ అనే సందేశాలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం జూలై 23న రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. ఈ షోల టిక్కెట్ ధర రూ. 600 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. తెలంగాణలో జూలై 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలు రూ. 200 (జీఎస్టీ మినహా) మరియు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 150 (జీఎస్టీ మినహా) పెరగనున్నాయి. జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ. 150 (జీఎస్టీ మినహా) మరియు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 106 (జీఎస్టీ మినహా) పెంపు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా టిక్కెట్ ధరలు 10 రోజుల పాటు పెరిగాయి. సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100 (దిగువ తరగతి), రూ. 150 (ఎగువ తరగతి) వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ. 200 (అన్ని తరగతులు) వరకు పెరగనున్నాయి. అమెరికాలో ‘హరి హర వీర మల్లు’ ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా పైగా వసూలు చేసి, మంచి స్పందనను కనబరుస్తున్నాయి.
క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే థీమ్‌తో రూపొందింది.