మాజీ సర్పంచ్ సౌమ్య, నాగరాజు, శ్రావణ్‌పై కేసు నమోదు
•కామారెడ్డి టౌన్ సీఐ నరహరి
కామారెడ్డి ప్రతినిధి జూలై 22 (ప్రజా జ్యోతి)
రాజంపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త ఆముద నాగరాజు, కామారెడ్డికి చెందిన మదనకంటి శ్రావణ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి టౌన్ సీఐ బి. నరహరి తెలిపారు. నాగరాజు శ్రావణ్‌కు సమీప బంధువని, తేజశ్రీ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం, మదనకంటి శ్రావణ్‌కు ఐదేళ్ల క్రితం కామారెడ్డికి చెందిన కొండ తేజశ్రీతో వివాహం జరిగింది. అయితే వివాహానంతరం పిల్లలు లేకపోవడం, వరకట్నం కోసం వేధింపులు, కులం పేరుతో బూతులు తిట్టిన ఘటనల నేపథ్యంలో తేజశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన భర్త శ్రావణ్ రెండో పెళ్లికి పాల్పడ్డారని, వరకట్నం కోసం తల్లడిల్లేలా వేధించారని, మాజీ సర్పంచ్ భర్త నాగరాజుతో కలిసి దూషణలకు పాల్పడ్డారని తేజశ్రీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తో పాటు వరకట్న నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ నరహరి వెల్లడించారు. గతంలో కూడా మాజీ సర్పంచ్ సౌమ్యపై తాను వేధింపుల కేసు పెట్టినట్లు బాధితురాలు పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.