ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో కీలక నిందితుడిగా (ఏ4) ఉన్న మిథున్ రెడ్డిని శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఆదివారం నాడు విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిని హాజరుపర్చగా, కోర్టు ఆయనకు ఆగస్టు 1 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. రాజమండ్రి జైలు వద్ద వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు జైలు గేటు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కార్యకర్తలను అడ్డుకున్నారు. నేరుగా వాహనంలోనే జైలులోపలికి తీసుకెళ్లారు. దాంతో కార్యకర్తలు వెనుదిరిగారు.
ఈ కేసులో లిక్కర్ పాలసీ రూపకల్పన, షెల్ కంపెనీలకు ముడుపుల సరఫరా, ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌లో మిథున్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో సిట్ ఇప్పటివరకు 300 పేజీల ప్రాథమిక చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది, ఇందులో 268 మంది సాక్షులను విచారించినట్లు, రూ.62 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. కాగా, వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. మిథున్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో కూడినదని, మిథున్ ఎలాంటి తప్పు చేయలేదని, చట్టపరంగా నిర్దోషిగా బయటకు వస్తాడని అన్నారు