ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దళారుల హవా!
• డబ్బు లేనివారికి ఇల్లు కలవరమేనా?
•ఇక చాలు… ఎన్నికల్లో మా ప్రతాపం చూపిస్తాం!
మండిపడుతున్న ప్రజలు
రాజంపేట జూలై 20 (ప్రజాజ్యోతి)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రాజంపేట మండలంలో దళారుల ప్రాభల్యం వల్ల అందుకున్న వికారరూపాన్ని దాల్చుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు, ఇల్లు పంపిణీ కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టర్లు మరియు మధ్యవర్తులు కుమ్మక్కై వేలాది మంది నిరుపేదల ఆశలను అర్ధాంతరంగా నిలిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లంచాలు – బెదిరింపులు – జాబితాల తొలగింపులు పథకానికి ఎంపికైన లబ్ధిదారుల వద్ద నుంచి రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకూ లంచాలు డిమాండ్ చేస్తున్న దళారులు, “డబ్బు ఇవ్వకపోతే జాబితా నుంచి నీ పేరు తీసేస్తాం” అని నిత్యం బెదిరిస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఒక ఇంటి నిర్మాణానికి ఎంచుకున్న కాంట్రాక్టర్ చేతి ద్వారా లబ్ధిదారులపై రూ.2 లక్షల వరకూ అదనపు భారాన్ని మోపుతున్నారు. ఇసుక కేటాయింపుల్లో అవకతవకలు – నిర్మాణాలు నిలిచిపోయిన పరిస్థితి ఇసుక సరఫరాలో కొనసాగుతున్న అవినీతి వల్ల అనేక ఇళ్ల నిర్మాణాలు ప్రారంభదశలోనే నిలిచిపోయాయి. “ఇసుక రావట్లేదు” అంటూ అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా “రేపు రా, ఇంకోసారి రా” అనే సమాధానాలతో పంపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సోషల్ మీడియాలో మండిపడుతున్న ప్రజలు “డబ్బు ఇవ్వకపోతే ఇల్లు రాదు!”, “ఇది గోప్య పథకమా లేదా ప్రభుత్వ పథకమా?”, “మా డబ్బుతో వేరే వాళ్లకి ఇళ్లు?” అంటూ ప్రజలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ఈ దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఎన్నికలపై హెచ్చరిక – ఈసారి వంచితులే నిర్ణయకర్తలు ఇల్లు రాక నష్టపోయిన వారు, ఇతర బాధితులంతా కలసి, ఈ ఎన్నికల్లో తమ ఓటుతో సమాధానం చెబుతామంటూ హెచ్చరిస్తున్నారు. “ఇప్పటి అధికారుల తీరు చూస్తే… స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమైన ప్రజాభిప్రాయమే వెలుగులోకి వస్తుంది” అని మండిపడుతున్నారు. కలెక్టర్ జోక్యం కోరుతూ – ఉద్యమానికి ప్రజలు సిద్ధం పథకంలో జరుగుతున్న అవకతవకలపై జిల్లా కలెక్టర్ తక్షణ జోక్యం చేయాలని, లంచం తీస్తున్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే విపక్షాల మద్దతుతో ఉద్యమంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నారు.