అనంతపురం జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. దోసె ముక్క గొంతులో ఇరుక్కోడంతో ఊపిరి ఆడక రెండేళ్ల బాలుడు మరణించాడు. జిల్లా కేంద్రంలోని తపోవనంలో నివాసం ఉంటున్న అభిషేక్, అంజనమ్మ దంపతుల కుమారుడు విశాల్ ఈ ఘటనలో మృత్యువాత పడ్డాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న ఉదయం అంజనమ్మ కొడుకుకు దోసె వేసిచ్చింది.
బాలుడు తింటుండగా దోసె ముక్క గొంతులో ఇరుక్కు పోయింది. దీంతో ఊపిరి ఆడక బాలుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అభిషేక్ హుటాహుటిన కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. కళ్లముందే కుమారుడు మరణించడం చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పిల్లాడి కడుపునింపాలని చూస్తే దోసె వాడి ప్రాణం తీసిందని తల్లి అంజనమ్మ రోధించిన తీరు స్థానికులను కలచివేసింది.