అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన తర్వాత విమాన ప్రయాణాలు, భద్రతపై ఆందోళన నెలకొంది. ముఖ్యంగా విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో పక్షులు, జంతువులు ఢీకొడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. దేశంలోని ప్రముఖ విమనాశ్రయాల్లో ఒకటైన హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఈ ముప్పు తప్పలేదు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ఇక్కడ ఏకంగా 49 ఘటనలు నమోదయ్యాయి. అయితే, ఈ సమస్య హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాలేదు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఇటీవలి సంవత్సరాల్లో ఏడాదికి 2000కు పైగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డేటా ప్రకారం దేశంలోని టాప్ 20 విమానాశ్రయాల్లో పక్షుల తాకిడి ఎక్కువగానే ఉంది. 2022లో 1,633 సంఘటనలు నమోదయ్యాయి. 2023లో 2,269కి పెరగ్గా, 2024లో కొద్దిగా తగ్గి 2,066 చోటుచేసుకున్నాయి. ఇక ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే దేశవ్యాప్తంగా 641 ఘటనలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో మే నాటికి నమోదైన 49 పక్షి, జంతువుల తాకిడి ఘటనలు నమోదయ్యాయి. అలాగే, పైలట్ల నుంచి 11 మేడే కాల్స్ కూడా వచ్చాయి. గతంతో పోలిస్తే ఇవి బాగా పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 2022లో 92 ఘటనలు నమోదు కాగా, 2023లో 136కి, 2024లో 143కి పెరిగాయి.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయం వంటి ప్రదేశాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. సంవత్సరానికి 400 కంటే ఎక్కువ పక్షి, జంతువుల తాకిడి ఘటనలు ఇక్కడ నమోదవుతున్నాయి. 2022లో 442 ఘటనలు నమోదు కాగా, 2023లో 616కి చేరుకుంది, 2024లో కొద్దిగా తగ్గి 419 నమోదయ్యాయి. 2025 మే నాటికి 95 ఘటనలు జరిగాయి. ఇటీవల ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన అహ్మదాబాద్ విమానాశ్రయం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇక్కడ 2022లో 80 ఘటనలు నమోదు కాగా, 2023లో 214కి పెరిగాయి. విమానాశ్రయాల చుట్టూ జరుగుతున్న పట్టణీకరణే ఇందుకు కారణమని ఈ గణాంకాలు తేల్చి చెబుతున్నాయి.
తరచూ జరుగుతున్న ఈ పక్షి, జంతువుల తాకిడి విమాన భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో విమానాశ్రయం చుట్టూ ఆవాసాలు ఏర్పడటం, పక్షులు, జంతువులకు ఆహార వనరులు లభ్యం కావడం, వాటి ఆశ్రయాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి. పక్షులను భయపెట్టే పరికరాలు, రన్‌వేలలో రెగ్యులర్‌గా పెట్రోలింగ్, ప్రత్యేక వన్యప్రాణి ప్రమాద నిర్వహణ బృందాలు వంటి సాంకేతికతలు ఉపయోగిస్తున్నారు.
హైదరాబాద్ వంటి విస్తరిస్తున్న నగరం కోసం మరిన్ని మెరుగైన చర్యలు అవసరం. ఇందులో చెత్త నిర్వహణ, బహిరంగ వధను నిరోధించడం, విమానాశ్రయాల సమీపంలో వన్యప్రాణులను ఆకర్షించే ఇతర పర్యావరణ కారకాలను పరిష్కరించడానికి స్థానిక సంస్థల నుంచి మరింత సహకారం అందితే తప్ప ఇలాంటి సమస్యలను పరిష్కరించడం అంత సులభం కాదని అధికారులు చెబుతున్నారు.