బీహార్ రాజధాని పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం జరిగిన దారుణ సంఘటన ఒకటి రాష్ట్రంలో తీవ కలకలం రేపింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ ఖైదీపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ దాడిలో చందన్ మిశ్రా అనే జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు మరణించాడు.
సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ఆసుపత్రి కారిడార్లోకి ప్రవేశించి, చందన్ మిశ్రా ఉన్న ఐసీయూ గదిలోకి వెళ్లి, అతనిపై అనేక రౌండ్లు కాల్పులు జరిపి, అక్కడ్నించి పరారయ్యారు.
మృతుడు చందన్ మిశ్రా, బక్సర్ జిల్లాకు చెందిన నేరస్థుడు. 2011లో రాజేంద్ర కేసరి అనే వ్యాపారి హత్య కేసులో దోషిగా తేలి బియూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను వైద్య కారణాలతో 15 రోజుల పెరోల్‌పై ఆసుపత్రిలో చేరాడు.
పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం, చందన్ మిశ్రాపై బక్సర్‌లో అనేక హత్య కేసులు ఉన్నాయి. ఈ దాడి వెనుక ప్రత్యర్థి గ్యాంగ్ ఉండవచ్చని, ముఖ్యంగా చందన్-షేరు గ్యాంగ్ మధ్య గత వైరం కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటన బీహార్‌లో రాజకీయ దుమారానికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీ ఈ సీసీటీవీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, నితీశ్ కుమార్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. రాష్ట్రంలో గూండా రాజ్ నడుస్తోందని ఆరోపించింది. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్, “బీహార్‌లో ఎవరూ సురక్షితంగా లేరా? 2005 కంటే ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయా?” అని ప్రశ్నించారు. ఇండిపెండెంట్ ఎంపీ పప్పూ యాదవ్ కూడా ఈ ఘటనను ఖండిస్తూ, రాష్ట్రంలో అధ్యక్ష పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఈ హత్యతో పాటు, ఇటీవల పాట్నాలో జరిగిన ఇతర హత్యలు రాష్ట్రంలో నేరాల రేటు పెరుగుతున్నాయనే ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.