బాల ఆధార్.. చిన్నారుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రత్యేకంగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఫొటో, పేరు వివరాలతో జారీ చేసే ఈ కార్డును చిన్నారులకు ఐదేళ్లు దాటాక అప్ డేట్ చేయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ విషయంపై ఆధార్ జారీ సంస్థ యూఐడీఏఐ కీలక సూచన చేసింది. ఐదేళ్లు దాటిన తర్వాత బాల ఆధార్ ను అప్ డేట్ చేయాలని, లేదంటే ఆ కార్డు రద్దవుతుందని హెచ్చరించింది. బాల ఆధార్ పొందిన చిన్నారులకు ఐదేళ్లు దాటిన తర్వాత తప్పనిసరిగా వేలిముద్రలు, కనుపాపలు, ఫొటో అప్‌డేట్ చేయాలని చెప్పింది.
ఏడేళ్లు దాటినా కూడా అప్ డేట్ చేయకుంటే సదరు బాల ఆధార్ రద్దవుతుందని స్పష్టం చేసింది. ఈమేరకు బాల ఆధార్ జారీ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఈ విషయంపై అలర్ట్ మెసేజ్ లు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఐదేళ్లు దాటిన, ఏడేళ్లలోపు పిల్లలకు చెందిన బాల ఆధార్ అప్ డేట్ పూర్తిగా ఉచితమని చెప్పారు. ఏడేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ అప్ డేట్ చేయడానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.