గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుండి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే రేపటి సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది.
కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను అజెండాగా ప్రతిపాదించింది. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని అజెండాగా పంపించింది. ఏపీ ఇచ్చిన బనకచర్ల అజెండాపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది.
బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని ఆ లేఖలో ప్రస్తావించింది. గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని పేర్కొంది.
కాగా, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రేపు సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమాచారం పంపించింది. ఢిల్లీలోని జలశక్తి ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ అంశంతో పాటు ఏమైనా అజెండా అంశాలు ఉంటే పంపించాలని జలశక్తి శాఖ కోరింది.