ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత మార్కెట్‌లో ప్రవేశానికి సిద్ధమైంది. ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో తన మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను నేడు ప్రారంభించనుంది. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్‌లో ఒక మైలురాయిగా నిలవనుంది. టెస్లా తన ప్రముఖ మోడల్ ‘వై’ ఎస్‌యూవీని భారత్‌లో విక్రయించేందుకు ప్రవేశపెట్టింది. దీని రియర్-వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) వేరియంట్ ధర రూ. 60 లక్షలు (ఆన్-రోడ్ ధర రూ. 61 లక్షలు), లాంగ్-రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ ధరను రూ. 68 లక్షలుగా నిర్ణయించింది.
ఈ వాహనాలు చైనాలోని టెస్లా షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి దిగుమతయ్యాయి. భారత్‌లో ఈ మోడల్ వై ధరలు అమెరికా (44,990 డాలర్లు), చైనా (2,63,500 యువాన్), జర్మనీ (45,970 యూరోలు)తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో 70 శాతం దిగుమతి సుంకం, లాజిస్టిక్స్ ఖర్చులే ధర పెరుగుదలకు కారణం. ఇప్పటికే ఐదు మోడల్ వై వాహనాలు షాంఘై నుంచి ముంబైకి చేరుకున్నాయి.
ముంబైలోని బీకేసీలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను టెస్లా ఏర్పాటు చేసింది. ప్రారంభంలో టెస్ట్ డ్రైవ్‌లు, వాహన డెలివరీలు అందుబాటులో ఉండవు. భారత్‌లో టెస్లా మరో షోరూమ్‌ను న్యూఢిల్లీలో, సర్వీస్ సెంటర్‌ను ముంబైలోని కుర్లా వెస్ట్‌లో, ఇంజనీరింగ్ హబ్‌ను పుణెలో, రిజిస్టర్డ్ ఆఫీస్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తోంది.
మోడల్ వై లోపలి భాగం నలుపు-తెలుపు రంగుల మినిమలిస్ట్ డిజైన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, 15.4-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, రెండో వరుస ప్రయాణికుల కోసం 8 అంగుళాల డిస్‌ప్లే వంటి అధునాతన సాంకేతిక ఫీచర్లను కలిగి ఉంది. ఆటోపైలట్, ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఈ వాహనం ప్రత్యేకతలు. అయితే భారత రోడ్లపై ఆటోపైలట్ పనితీరు ఇంకా పరీక్షించాల్సి ఉంది. ఈ ఎస్‌యూవీ ఐదు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ వేరియంట్ 498 హార్స్‌పవర్, 493 ఎన్ఎం టార్క్‌ను కలిగి ఉంది.
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈవీలపై దిగుమతి సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించడం టెస్లా లాంటి గ్లోబల్ కంపెనీలను ఆకర్షిస్తోంది. టెస్లా ఈ ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో బీఎండబ్ల్యూ ఐఎక్స్1, కియా ఈవీ6 వంటి వాహనాలతో పోటీపడనుంది.