తెలంగాణలో ఇవాళ కొత్త రేషన్‌కార్డుల పండగ జరగబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్‌రెడ్డి. కొత్తగా రాష్ట్రంలో 3,58,187 రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. దీని ద్వారా 11,11,223 మందికి లబ్ధి చేకూరుతుంది. దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95,56,625కి చేరనుంది. పాత కార్డుల్లో 4,41,851 మంది కొత్త సభ్యులను చేర్చుతున్నారు. ఈ విస్తరణతో మొత్తం 15,53,074 మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది. కొత్త రేషన్ కార్డుల జారీ, పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ. 1150.68 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మొదటి దశలో నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా ఇప్పటికే 2,03,156 కొత్త కార్డులు మంజూరు చేశామని గుర్తుచేశారు. ఆ కార్డుల ద్వారా 5,90,488 మంది లబ్ధిదారులు, పాత కార్డుల్లో అదనంగా చేర్చిన 6,39,784 మంది సభ్యులతో కలిపి మొత్తం 12,30,272 మంది రేషన్ అందుకుంటున్నారని వివరించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా, పారదర్శకతతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
పదేళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. అంతేకాదు, ఇంత పెద్దమొత్తంలో కొత్త కార్డులు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 50,102 కొత్త కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో 31,772 కొత్త రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నారు. కొత్త కార్డుల జారీ తర్వాత 6,67,778 రేషన్‌కార్డులతో మొదటిస్థానంలోకి వెళ్లబోతోంది హైదరాబాద్. ములుగు జిల్లాలో అత్యల్పంగా 96,982 కార్డులు మాత్రమే ఉండనున్నాయి