లార్డ్స్ టెస్టులో నాలుగో రోజు ఆటలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో కేవలం 192 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో ఇంగ్లండ్ పనిబట్టాడు. బుమ్రా 2, సిరాజ్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్ దీప్ 1 వికెట్ తీశారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో జో రూట్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 33, హ్యారీ బ్రూక్ 23, ఓపెనర్ జాక్ క్రాలీ 22 పరుగులు చేశారు. ఓలీ పోప్ (4), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జేమీ స్మిత్ (8) విఫలమయ్యారు.
ఇక, 193 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే, ఇంగ్లండ్ ఎక్స్ ప్రెస్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆరంభంలోనే భారత్ ను దెబ్బకొట్టాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) ఖాతా తెరవకముందే పెవిలియన్ కు పంపించాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 5 పరుగులు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (5 బ్యాటింగ్), కరుణ్ నాయర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 188 పరుగులు చేయాలి.
ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 387 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ కూడా తన తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులే చేసింది.