హైదరాబాద్ కేంద్రంగా 200 అమెరికా కంపెనీలు పనిచేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో నిర్వహించిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిందని అన్నారు. అమెరికా – తెలంగాణ మధ్య వాణిజ్య బంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అమెరికన్ల మద్దతు కావాలని రేవంత్ కోరారు. అమెరికాలో తెలుగు ప్రజలకు స్నేహపూర్వక బంధం ఎంతో బలమైనదని ఆయన అన్నారు. అమెరికాలో తెలుగు భాష వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు.