హైదరాబాద్‌లో కల్తీ కల్లు తీవ్ర విషాదాన్ని నింపింది. కల్తీ చేసిన కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 31 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
నగరంలోని ఇంద్రానగర్, భాగ్యనగర్ ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో ఈ నెల 5, 6 తేదీల్లో కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. పరిస్థితి విషమించడంతో వారిని నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం బాధితులందరినీ నిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో చాకలి బొజ్జయ్య (55), స్వరూప (61), సీతారాం (74), మౌనిక (25), మెట్ల నారాయణ (40) ఉన్నారు.
ఈ ఘటనపై పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు వేగంగా స్పందించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నాలుగు కల్లు దుకాణాల నిర్వాహకులు, విక్రేతలతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్ నేత కూన సత్యంగౌడ్ కుమారులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. దుకాణాల నుంచి కల్లు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. కల్లులో మత్తు కోసం ప్రమాదకరమైన ఆల్ప్రాజోలం వంటి రసాయనాలు కలపడమే ఈ విషాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మరోవైపు, మంత్రి జూపల్లి కృష్ణారావు నిమ్స్‌లో బాధితులను పరామర్శించారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని, లైసెన్సులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలోనూ నగరంలోని పలు కల్లు దుకాణాల్లో కల్తీ జరుగుతున్నట్టు ఆరోపణలు రావడం, కొన్నింటి లైసెన్సులు రద్దు చేసినా విక్రయాలు ఆగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.