అమర్‌నాథ్‌ యాత్రకు వెల్లువెత్తిన భక్తులు.. ఆరు రోజుల్లో లక్ష దాటిన దర్శనాలు

V. Sai Krishna Reddy
2 Min Read

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర భక్తి శ్రద్ధలతో, అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 1.11 లక్షల మందికి పైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో యాత్ర నిర్విఘ్నంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

బుధవారం జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి 7,579 మంది భక్తులతో కూడిన మరో బ్యాచ్ కశ్మీర్‌కు బయలుదేరింది. వీరిలో 3,031 మంది బాల్తాల్ బేస్ క్యాంప్‌కు, 4,548 మంది పహల్గామ్ బేస్ క్యాంప్‌కు ప్రత్యేక భద్రతా కాన్వాయ్‌ల మధ్య తరలివెళ్లినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ నుంచి వచ్చే యాత్రికులతో పాటు చాలామంది నేరుగా బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపుల వద్దకు చేరుకుని అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ (ఆన్-స్పాట్) చేసుకుని యాత్రలో పాల్గొంటున్నారని శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) అధికారులు వెల్ల‌డించారు.

కనీవినీ ఎరుగని భద్రత
ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ వద్ద ఉగ్రవాదులు 26 మంది పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి నేపథ్యంలో ఈ ఏడాది యాత్రకు అధికారులు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. సైన్యం, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, స్థానిక పోలీసులతో పాటు అదనంగా 180 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. భద్రతా కారణాల రీత్యా ఈ సంవత్సరం యాత్రికులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచడం లేదని స్పష్టం చేశారు.

అండగా నిలుస్తున్న స్థానికులు
భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ స్థానిక కశ్మీరీలు యాత్రికులకు సంపూర్ణ సహకారం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. యాత్రికుల మొదటి బ్యాచ్ కశ్మీర్‌లోకి ప్రవేశించగానే స్థానికులు పూలమాలలతో స్వాగతం పలికారు. ఇటీవల శ్రీనగర్‌కు చెందిన కొందరు స్థానికులు 30 కిలోమీటర్లు ప్రయాణించి, యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులకు శీతల పానీయాలు, మంచినీరు అందించారు.

ఈ యాత్ర ఈ నెల‌ 3న ప్రారంభమైంది. మొత్తం 38 రోజుల పాటు కొనసాగి, శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ పర్వదినమైన ఆగస్టు 9న ముగియనుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *