భద్రాచలం రామాలయం ఈవో రమాదేవిపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈవోలపై దాడులు చేయడం సరికాదని, ఇలాంటివి పునరావృతమైతే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచలం దేవాలయ భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునేందుకు ఈవో రమాదేవి మంగళవారం తన సిబ్బందితో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి గ్రామస్థులు కొందరు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె స్పృహతప్పి పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆమెను భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశం కావడంతో, మంత్రి కొండా సురేఖ వెంటనే స్పందించారు. ఈ సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా ఉన్న ఈ భూముల వివాదాన్ని పరిష్కరించి, ఆలయ ఆస్తులను కాపాడాలని కోరారు.