యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘వార్ 2’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తన సహనటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
దాదాపు 149 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ సినిమా చిత్రీకరణ ఎట్టకేలకు ముగిసిందని హృతిక్ తన పోస్టులో తెలిపారు. “ఛేజింగ్‌లు, యాక్షన్, డ్యాన్స్, రక్తం, చెమట, గాయాలతో గడిచిన ఈ 149 రోజుల ప్రయాణం పూర్తయింది. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది” అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం పనిచేయడం మిశ్రమ భావోద్వేగాలను మిగిల్చిందని అన్నారు.
సహనటుల గురించి మాట్లాడుతూ, “జూనియర్ ఎన్టీఆర్ గారూ.. మీతో కలిసి పనిచేయడం, ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని సృష్టించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని హృతిక్ వ్యాఖ్యానించారు. కథానాయిక కియారా అద్వానీ గురించి ప్రస్తావిస్తూ, “తెరపై నీలోని మరో ప్రమాదకరమైన కోణాన్ని ప్రపంచం చూడబోతోంది. నీతో స్క్రీన్ పంచుకోవడం అద్భుతంగా అనిపించింది” అంటూ ప్రశంసించారు.
చిత్ర దర్శకుడు అయన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రాల సినిమాటిక్ విజన్‌కు హృతిక్ ధన్యవాదాలు తెలిపారు. చిత్రబృందం మొత్తం తమ శక్తికి మించి పనిచేశారని కొనియాడారు. ‘కబీర్’ పాత్రకు వీడ్కోలు పలకడం కాస్త బాధగా, కాస్త తీయగా ఉందని, మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాను ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.