కులాన్ని బట్టి లక్షల్లో ధర.. యూపీలో రూ.100 కోట్ల మత మార్పిడి దందా

V. Sai Krishna Reddy
2 Min Read

ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున సాగుతున్న అక్రమ మత మార్పిడి రాకెట్‌ను యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ఛేదించింది. కులాన్ని బట్టి ధర నిర్ణయించి, డబ్బు ఆశ చూపి హిందూ, ఇతర మతాల వారిని ఇస్లాంలోకి మార్చుతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ రాకెట్‌కు విదేశాల నుంచి సుమారు రూ.100 కోట్ల నిధులు అందినట్టు గుర్తించడం సంచలనం సృష్టిస్తోంది.

బలరాంపూర్ జిల్లా మధ్‌పూర్ గ్రామంలో గత మూడు, నాలుగేళ్లుగా హజ్రత్ బాబా జమాలుద్దీన్ ‘పీర్ బాబా’ పేరుతో చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. హిందూ సూఫీ సాధువుగా నటిస్తూ, అమాయకులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ నెల 5న యూపీ ఏటీఎస్ అధికారులు దాడి చేసి, ఈ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న జమాలుద్దీన్‌తో పాటు, ఆయన భార్య నీటూ అలియాస్ నస్రీన్‌ను కూడా అరెస్ట్ చేశారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా మత మార్పిడుల కోసం కులాన్ని బట్టి రేట్లు నిర్ణయించినట్టు తేలింది. బ్రాహ్మణ, క్షత్రియ, సిక్కు మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు రూ. 15-16 లక్షలు, ఓబీసీ మహిళలకు రూ. 10-12 లక్షలు, ఇతర వర్గాల వారికి రూ. 8-10 లక్షలు ఆశ చూపినట్టు అధికారులు తెలిపారు. ఈ రాకెట్‌కు ఇస్లామిక్ దేశాల నుంచి సుమారు రూ. 100 కోట్ల నిధులు అందాయని, వీటిని 40కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ డబ్బుతో జమాలుద్దీన్ విలాసవంతమైన బంగళాలు, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు.

ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 40 మందిని ప్రేమ, డబ్బు ఆశ చూపి లేదా బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు “షిజ్రా-ఎ-తయ్యబా” అనే పుస్తకాన్ని ప్రచురించి ఇస్లాం ప్రచారానికి ఉపయోగించినట్టు వెల్లడైంది. నిందితులపై గోమతీనగర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి లక్నో జైలుకు తరలించారు. ఈ మత మార్పిడుల వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయని, వందల కోట్ల నిధులతో హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *