ఆదివాసీల తొలి పండగ ఆకాడి…!
జులై 10: పౌర్ణమితో ఆకాడి పండగ ముగింపు
* గుమ్మడి లక్ష్మీ నారాయణ,ఆదివాసీ రచయితల వేదిక
రామారెడ్డి జూలై 07 (ప్రజా జ్యోతి)
పండుగలు జరుపుకోవడం,సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఆదివాసీలు ముందు వరుసలో ఉంటారు. కొన్ని తెగల ఆదివాసీ గూడేల్లో జరిగే పండుగలు వైవిధ్యంగా ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు, కోలాములు, పర్ధానులు, తోటీలు, నాయకపోడులు తమ పండుగలు ఆషాఢ మాసంలో ‘ఆకాడి’ తో శ్రీకారం చుడతారు. పశువులకు రక్షణ కల్పించే దేవుడిగా భావించి ప్రకృతి మాతకు, రాజుల్ పేన్ కు మొక్కులు చెల్లించుకునే ఈ ఆదివాసీల ముఖ్యమైన పండగ ఆకాడి. వానాకాలం సీజన్ ప్రారంభంలో మొదలు చినుకు రాలినా..దుక్కి దున్నినా…!విత్తనాలు వేసి పంటలు చేతికొచ్చేవరకు కూడా పూజా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆషాఢంలో తొలి రోజు లేదా నెలవంక కనపడిన రోజు (ఈసారి జూన్ 26) నుండి ఆకాడి సంబురాలు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ప్రకృతికి, పశువులకు రక్షణ కల్పించే దేవుడి పండుగగా ఆకాడిని భావించడంలో ఉద్దేశ్యం ఏమంటే పాడి పశువులు చల్లంగా ఉంటేనే తమ పంటలకు కొదవుండదని వారి ప్రగాఢ విశ్వాసం.
వనంలో పూజలు..!
పండగ తొలి రోజున అడవులకు వెళ్లి ప్రత్యేక పూజలు, వంటావార్పులతో అందరూ ఆనందంగా గడుపుతారు. జూన్ 26న కాకుండా జూన్ 28న ప్రారంభం అయిన ఆకాడి పూజలు పక్షం రోజుల పాటు కొనసాగుతాయి. దీంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆషాడ మాసం ప్రారంభంతో గిరిజన ఆదివాసీ గూడేల్లో ఆకాడితోనే మిగతా పండుగలు జతకావడంతో ఈ పండుగకు ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. అడవిని దేవతగా కొలిచే ఆదివాసీలు.. రాజుల్ పేన్ ను పాడిపశువులకు రక్షణ కల్పించే దేవతగా మొక్కుతారు. నెలవంక కనిపించగానే ప్రతీ ఊరిలో పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దుక్కులు కాస్త ఆలస్యం కావడంతో పండుగ కూడా ఆలస్యంగా జరుగుతున్నట్లు పెద్దలు(దేవరీ) వెల్లడించారు.
పూజా విధానం….!
ఆకాడి వేడుకల్లో భాగంగా గూడేల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ పొలిమేరలో ఉండే చెట్టువద్దకు వెళ్లి దేవతల ప్రతిమలను శుద్ధి చేస్తారు. పసుపు గీతలు వేసి బియ్యంతో రాజుల్ పెన్ నకు పూజలు చేస్తారు. అనంతరం కటోడాలు ఇచ్చే అక్షింతలను సమర్పిస్తారు. అడవిలోనే నైవేద్యం తయారు చేస్తారు. సహ పంక్తి భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. తర్వాత పసుపు గీతలు గీసి దాని పైనుంచి పశువులను అడవుల్లోకి తోల్కొని వెళ్తారు. ఈ సందర్భంగా తుర్రను ప్రత్యేకంగా ఊదుతారు. ఇది పశువుల కాపరుల వద్ద ఉంటుంది. పశువులు అడవిలో తప్పిపోకుండా ఎక్కడ ఉన్నా ఈ శబ్దం విని ఇళ్లకు చేరుకుంటాయని నమ్ముతారు. అడవిలోని చెట్లను దేవుడిగా భావించి ఆకాడి పేన్ పూజల అనంతరం ఆకులను ఇంటికి తీసుకెళ్తారు. పూజలు అయ్యేంత వరకు ప్రత్యేకించి టేకు ఆకులను ముట్టకూడదు.
కోడి జాతకం ప్రత్యేకం…!
ఆకాడి పూజల్లో కోడి జాతకం ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రతీ ఇంటి నుంచి కోడిని కొనుగోలు చేసి దేవతకు బలి ఇస్తారు. ఈ ఏడాదంతా ఎలా గడుస్తుంది? వర్షాలు ఎలా పడతాయి? పంటలు ఎలా పండుతాయి? అనే విషయాలను ఆదివాసీలు దేవరీలు చెప్పే కోడి జాతకం ద్వారా తెలుసుకుంటారు. గ్రామం నుంచి సేకరించిన బియ్యంతో భోజనం తయారు చేస్తారు. ముద్దలుగా చేసి ఆరగిస్తారు. యేత్మాసూర్ పేన్కు మొక్కులు ఆకాడి అనంతరం గ్రామంలోకి చేరుకునే ఆదివాసీలు యేత్మాసూర్ పేన్ కు మొక్కులు చెల్లిస్తారు. ఆదివాసీలు, పశువులు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని పూజలు చేస్తారు. అకాడి పండుగ అనంతరం నాగుల పంచమి, జామురావూస్, శివభోడి, పొలాల అమావాస్య, బడిగా, దసరా, భోగి, దీపావళి పండుగలను ఆదివాసీ గూడేల్లో జరుపుకొంటారు. ఇలా…ఆదివాసీలకు వర్షాకాలం సీజన్ ఈ పండుగలతోనే ముగిస్తుంది.