తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయన బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సమావేశాలు రాష్ట్రంలో రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుపై కేంద్రీకృతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీలోని తన నివాసంలో అజయ్ దేవగణ్ తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. ఈ ఫిల్మ్ సిటీలో ఏఐ (AI) టెక్నాలజీతో కూడిన వీఎఫ్ఎక్స్ (VFX), స్మార్ట్ స్టూడియోలు ఏర్పాటు చేయాలని, అలాగే ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను కూడా స్థాపించాలని అజయ్ దేవగణ్ ప్రతిపాదనలు అందజేశారు.
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తోనూ ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే అంశం వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ యూనివర్సిటీ దోహదపడుతుందని భావిస్తున్నారు.