రాజకీయ నాయకులు సాధారణంగా సభలు, సమావేశాల్లో కనిపిస్తుంటారు. అయితే, తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కబడ్డీ కోర్టులో దిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పర్యటనలో భాగంగా వారు స్థానిక మినీ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి క్రీడాకారులతో కలిసిపోయి వారిలో స్ఫూర్తిని నింపేందుకు స్వయంగా కబడ్డీ ఆడారు.
మంత్రులతో పాటు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి కూడా కబడ్డీ ఆడారు. మంత్రులు మైదానంలోకి దిగి కబడ్డీ ఆడటంతో అక్కడున్న యువ క్రీడాకారుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ స్థానంలోనిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి అవసరమైన శిక్షణ, మౌలిక వసతులు కల్పించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పాటుపడతామని మంత్రులు పేర్కొన్నారు.