చూస్తుండగానే కళ్ల ముందే ఓ రోడ్డు అదృశ్యమైంది. ఐదు నిమిషాల వ్యవధిలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఉగ్రరూపం దాల్చిన నదిలా మారిపోయింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో లానో నది సృష్టించిన ఈ బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పోటెత్తడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
గ్వాడల్పే నది సమీపంలోని క్యాంప్ మిస్టిక్‌లో ఉంటున్న 10 మంది బాలికలు, ఒక కౌన్సలర్తో సహా 11 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఈ క్యాంపు ఏకంగా 20 అడుగుల నీటిలో మునిగిపోయిందంటే వరదల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ వరద విలయం కారణంగా టెక్సాస్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 82 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 41 మంది ఆచూకీ తెలియరాలేదు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం ఆవేదన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.