టాలీవుడ్లో వారసుల ప్రవేశం కొనసాగుతోంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో యువ కథానాయకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కుమారుడైన మాధవ్ రాజ్ భూపతి హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘మారెమ్మ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
తెలంగాణ గ్రామీణ వాతావరణంలో సాగే ఈ కథతో నూతన దర్శకుడు నాగరాజ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మోక్ష ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని చిత్రబృందం తెలిపింది. ప్రచార కార్యక్రమాలను మొదలుపెడుతూ, సోమవారం సాయంత్రం ‘మారెమ్మ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే, ఆగస్టు నెలలో సినిమా గ్లిమ్స్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి, మాధవ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. అయితే, ఆ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ కొన్ని కారణాల వల్ల దాని విడుదల నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ‘మారెమ్మ’ చిత్రంతో మాధవ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పెదనాన్న రవితేజ స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెడుతున్న మాధవ్, ‘మారెమ్మ’ చిత్రంతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది